YS Jagan: ఒక్క అబద్ధం ఆడని కారణంగా ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నా: అసెంబ్లీలో సీఎం జగన్
- 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీ ఇవ్వమంటూ సలహాలు వచ్చినా సాధ్యంకాని వాగ్దానం చేయలేకపోయానన్న ఏపీ సీఎం
- చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారు.. అమలు చేయరని మండిపాటు
- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం
ఒక్క అబద్ధం ఆడని కారణంగా ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నానని సీఎం జగన్ అన్నారు. చేయలేనివి చెప్పకూడదని, మాట ఇస్తే తప్పకూడదని అన్నారు. రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన ప్రసంగించారు.
విశ్వసనీయత ఎప్పటికైనా గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇద్దామని చాలామంది శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. కానీ చేయలేనివి చెప్పకూడదు. మాట ఇస్తే తప్పకూడదని వాళ్లందరికీ నేను చెప్పాను. ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా.. ఆ ఒక్క రోజు అధర్మం చేయని కారణంగా ఒక్క శాతం ఓట్ల తేడాతో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది’’ అని జగన్ అన్నారు.
చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారని, హామీలను అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకి లేదని ఆరోపించారు. మనసు లేని నాయకుడు, మోసం చేసే నాయకుడు అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. అలవి కాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో దారుణంగా విఫలమైనందుకు 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే చంద్రబాబుకు దక్కాయన్నారు. మాట మీద నిలబడ్డాం కాబట్టే ప్రజలు వైఎస్సార్‌సీపీకి 151 స్థానాలు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్ని ఎలక్షన్స్‌లో కూడా ప్రజలు గెలిపించి గుండెల్లో పెట్టుకున్నారని, విశ్వసనీయతకు అర్థం జగన్ అని అన్నారు. 99 శాతం హామీలను అమలు చేశామని పేర్కొన్నారు.
వాగ్దానాలు అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని, అమలు చేసిన చరిత్ర అంతకన్నా లేదని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బాబు మేనిఫెస్టోను నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మడమే అవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రూ.70 వేల కోట్ల అప్పుకే రాష్ట్రం శ్రీలంక అవుతుందని అంటున్న చంద్రబాబు రూ.1.26 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని సీఎం జగన్ ప్రశ్నించారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మంచిపై ప్రతి ఇంటా చర్చ జరగాలని అన్నారు. హామీల అమలు విషయంలో ప్రజలు శెభాష్ అని మెచ్చుకుంటున్నారని అన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కూటమికి, వైసీపీకి వచ్చిన ఓట్ల మధ్య ఒక్క శాతమే వ్యత్యాసం ఉందన్నారు. 46 శాతం ఓట్లు కూటమికి, వైసీపీకి 45 శాతం ఓట్లు వచ్చాయని ఆయన ప్రస్తావించారు.