coma: అమ్మ చెప్పిన జోక్ విని.. నవ్వుతూ కోమా నుంచి బయటకొచ్చిన మహిళ
- సెప్టెంబర్ 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంతో కోమాలోకి వెళ్లిన అమెరికా మహిళ
- ఆగస్టు 2022లో కోమా నుంచి బయటకి
- గత కొన్ని రోజులుగా రికవరీ అవుతున్న మహిళ
దాదాపు ఐదేళ్ల పాటు జీవచ్చవంలా బెడ్‌కే పరిమితమైన ఓ మహిళ అమ్మ చెప్పిన జోక్ విని నవ్వుతూ కోమా నుంచి బయటకొచ్చింది. అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన జెన్నిఫర్ ఫ్లెవెల్లెన్ ఐదేళ్లక్రితం సెప్టెంబర్ 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయమవ్వడంతో కోమాలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమె బెడ్‌కే పరిమితమైంది. అయితే 25 ఆగస్ట్ 2022న అద్భుతం జరిగింది. తన తల్లి పెగ్గి మీన్స్ చెప్పిన జోక్ విని జెన్నిఫర్ స్పందించింది. నవ్వుతూ కోమా నుంచి బయటపడింది. కాగా గత కొన్ని రోజుల నుంచి ఆమె రికవరీ మొదలైంది. మాట్లాడేందుకు, శరీర భాగాల్లో చలనం కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
జెన్నిఫర్‌లో రికవరీ మొదలైందని తల్లి పెగ్గి మీన్స్ వెల్లడించింది. ఆమె కోమా నుంచి లేచి నవ్వుతుండడం చూసి మొదట భయమేసిందని, ఆమె ఎప్పుడూ అలా చేయలేదని గుర్తుచేసుకుంది. తమ కల నిజమైందని, ఇంతకాలం ఆమెను దూరం చేస్తూ మూసుకుపోయిన ద్వారం తెరుచుకుందని అమితానందాన్ని వ్యక్తం చేసింది. జెన్నీఫర్‌కి వికలాంగ వ్యాను, ఇంటి పునర్నిర్మాణం కోసం ‘గోఫండ్‌మీ’ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించామని ఆమె చెప్పింది. మాట్లాడలేకపోతున్నప్పటికీ ఆమె కోమా నుంచి బయటకొచ్చిందని, తల ఊపుతోందని వెల్లడించింది.
మొదట్లో బాగా నిద్రపోయేదని, రోజులు గడుస్తున్న కొద్దీ మరింత దృఢంగా మారుతోందని, మెలకువగా ఉంటోందని పేర్కొంది. కాగా ఇలా జరగడం చాలా అరుదని జెన్నిఫర్ ని ‘మేరీ ఫ్రీ బెడ్ రిహాబిలిటేషన్ హాస్పిటల్’లో పర్యవేక్షిస్తున్న డాక్టర్ రాల్ఫ్ వాంగ్ వ్యాఖ్యానించారు. కోమా నుంచి మేల్కోవడమే కాకుండా కోలుకోవడం బహుశా 1-2 శాతం మంది రోగుల్లో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. కాగా జెన్నిఫర్ ఇటీవల తన కొడుకు ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూడడానికి స్టేడియానికి వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు ప్రత్యేక వైద్య సేవలు అందించారు.