India: అండర్-19 వరల్డ్ కప్: అద్భుత విజయంతో ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
- దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్
- నేడు బెనోనీలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి సెమీస్
- 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
- 48.5 ఓవర్లలో 8 వికెట్లకు లక్ష్యాన్ని ఛేదించిన భారత్
దక్షిణాఫ్రికాతో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఓటమి కోరల్లోంచి బయటికి వచ్చి అద్భుత విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 245 పరుగుల లక్ష్యాన్ని 48.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఛేదించింది. సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహారన్ అద్భుతమైన ఆటతీరుతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
దక్షిణాఫ్రికాలోని బెనోనీలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. 245 పరుగుల లక్ష్యం కష్టసాధ్యమేమీ కానప్పటికీ, భారత్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
ఈ దశలో సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహారన్ జోడీ పట్టుదలతో ఆడి భారత్ విజయానికి బాటలు వేసింది. సచిన్ దాస్ 95 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ తో 96 పరుగులు చేశాడు. సచిన్ దాస్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. కెప్టెన్ ఉదయ్ సహారన్ 6 ఫోర్లతో 81 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 171 పరుగులు జోడించడం విశేషం.
చివర్లో భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో గెలుపుపై సందేహాలు ఏర్పడ్డాయి. కెప్టెన్ ఉదయ్ సహారన్, మురుగన్ అభిషేక్ (10) ఒత్తిడికి లోనై రనౌట్ రూపంలో వెనుదిరిగారు. అయితే రాజ్ లింబాని ఆఖర్లో 4 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 13 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వెనా మఫాకా 3, ట్రిస్టాన్ లూస్ 3 వికెట్లు తీశారు.
ఇక, ఎల్లుండి జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో విజేతతో భారత్ జట్టు ఫిబ్రవరి 11న జరిగే ఫైనల్లో ఆడనుంది. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్స్ చేరడం భారత్ కు ఇది వరుసగా ఐదోసారి.