Budget: ఓట్ ఆన్ బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం
- మరికాసేపట్లో ఉభయ సభలలో బడ్జెట్
- నాలుగు నెలలకు రూ.96 వేల కోట్ల ప్రతిపాదన
- బడ్జెట్ కు పూజలు నిర్వహించిన మంత్రి బుగ్గన
ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఓట్ ఆన్ బడ్జెట్ కు బుధవారం ఆమోదం తెలిపింది. ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్.. బడ్జెట్ కు లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. ఉదయం పదకొండు గంటలకు ఇటు శాసన సభలో, అటు మండలిలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ఛాంబర్ లో బడ్జెట్ కు పూజలు చేశారు.
అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఆర్థిక ఏడాదికి ప్రభుత్వం రూ.2.86 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ అంచనా వేసింది. అయితే, ప్రభుత్వ గడువు మరో నాలుగు నెలలు మాత్రమే ఉండడం, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఈ నాలుగు నెలల కాలానికి ప్రభుత్వం రూ.96 వేల కోట్ల దాకా బడ్జెట్ ప్రతిపాదనలు చేయనున్నట్లు సమాచారం.