CRED CEO: ‘క్రెడ్’ సీఈవో ఒకప్పుడు డెలివరీ బాయ్ గా చేశాడట..!
- కుటుంబం దివాలా తీయడంతో తప్పలేదన్న కునాల్ షా
- డాటా ఎంట్రీ జాబ్ కూడా చేసినట్లు వెల్లడి
- ఓవైపు రెండు ఉద్యోగాలు చేస్తూనే డిగ్రీ పూర్తిచేసిన కునాల్
దేశంలో ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ ‘క్రెడ్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ షా ఒకప్పుడు డెలివరీ బాయ్ గా కూడా పనిచేశాడట. అదే సమయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్ గా కూడా పనిచేశాడు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారంటూ ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు బిఖ్ చందాని ట్విట్టర్ లో వెల్లడించారు. అంతేకాదు ఈ రెండు ఉద్యోగాలు చేస్తూనే కాలేజీలో చేరి డిగ్రీ కూడా పూర్తిచేశాడని తెలిపారు. ఇటీవల ఢిల్లీలోని ఓ కాఫీ షాప్ లో కునాల్ షా ను కలిశానని బిఖ్ చందానీ తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు.
స్టార్టప్ కంపెనీల సీఈవోలలో సైన్స్ , ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, ఫైనాన్స్ డిగ్రీలు పొందినవారే ఎక్కువని బిఖ్ చందాని చెప్పారు. అయితే, కునాల్ మాత్రం ఫిలాసఫీలో డిగ్రీ పూర్తిచేశారని వివరించారు. ఫిలాసఫీ సబ్జెక్ట్ ను ఎంచుకోవడానికి కారణం ఇంటర్ లో మార్కులు తక్కువ రావడమా లేక ఫిలాసఫీ మీద ఆసక్తితో చేశారా అని అడుగగా.. ఆ రెండూ కాదని కునాల్ జవాబిచ్చారన్నారు. అప్పట్లో తమ కుటుంబం దివాలా తీయడంతో తాను ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
దీంతో డెలివరీ బాయ్ గా, డాటా ఎంట్రీ ఆపరేటర్ గా రెండు ఉద్యోగాలు చేసినట్లు చెప్పారు. ఈ రెండు జాబ్ ల కారణంగా తనకు కేవలం ఉదయం పూట మాత్రమే కాస్త టైం దొరికేదని వివరించారు. అప్పట్లో ఫిలాసఫీ సబ్జెక్ట్ కు మాత్రమే ఉదయం పూట క్లాసులు జరిగేవని, అందుకే తాను ఫిలాసఫీ సబ్జెక్టుతో డిగ్రీ చదివానని కునాల్ పేర్కొన్నారు. కునాల్ షా చెప్పిన వివరాలతో బిఖ్ చందానీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.