DK Shivakumar: డీకే శివకుమార్ పై కేసు నమోదు చేయండి: బెంగళూరు పోలీసులకు స్పెషల్ కోర్టు ఆదేశం
- శ్రీకాంత్ పూజారి అనే కరసేవకుడిని అరెస్ట్ చేయడంపై బీజేపీ నేతల నిరసన
- నన్ను కూడా అరెస్ట్ చేయండి అని రాసిన ప్లకార్డుల ప్రదర్శన
- ప్లకార్డుల ఫొటోను మార్ఫింగ్ చేసి, వాడిన కాంగ్రెస్ ఐటీ సెల్
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బెంగళూరు పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డీకేతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఐటీ సెల్ హెడ్ బీఆర్ నాయుడుపై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బీజేపీ నాయకుల నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను మార్ఫింగ్ చేసిన కేసులో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే... 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో పాల్గొన్న శ్రీకాంత్ పూజారి అనే కరసేవకుడిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా వీరు... 'నేను కూడా కరసేవకుడినే... నన్ను కూడా అరెస్ట్ చేయండి' అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
అయితే, ప్లకార్డులతో ఉన్న ఫొటోను మార్ఫింగ్ చేసినట్టు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్కామ్ లు, అక్రమాలు జరిగినట్టుగా ప్లకార్డులపై ఉన్నట్టు ఫొటోలను మార్ఫింగ్ చేశారని వారు కేసు పెట్టారు. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఫొటోను మార్ఫింగ్ చేసి, వాడారని బీజేపీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ యోగేంద్ర హొడగట్ట తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫొటోను డీకే శివకుమార్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.