vinod kumar: జిల్లాల పునర్విభజనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ సూచన
- పునర్విభజన పేరుతో జిల్లాలను మారిస్తే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు తలెత్తుతాయన్న వినోద్ కుమార్
- పునర్విభజన... పేర్ల మార్పుతో ప్రయోజనం ఉండదన్న బీఆర్ఎస్ నేత
- ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్
జిల్లాల పునర్విభజనపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. పునర్విభజన పేరుతో జిల్లాలను మారిస్తే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఎన్నో చర్చోపచర్చల అనంతరమే జిల్లాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు పునర్విభజన... పేర్ల మార్పుతో ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఈ ఏడాది చివరిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిందని ఆ హామీని నెరవేర్చుకోవాలని సూచించారు. నెల రోజుల్లో లక్షా తొంబై వేల ఖాళీలను గుర్తించాలన్నారు. తమ హయాంలో లక్షా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. పెద్దల సభకు వెళ్లడంతో ప్రొఫెసర్ కోదండరాంకు బాధ్యతలు పెరిగాయని... ఆయన నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.