Congress: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫైర్

Telangana Congress leader Adnaki Dayakar fires at YCP MP Vijayasai Reddy
  • విజయసాయి రెడ్డి పెద్ద అజ్ఞాని అని మండిపడ్డ దయాకర్  
  • తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అక్కసు ఎందుకని వైసీపీ ఎంపీకి ప్రశ్న
  • ప్రధాని మోదీ దగ్గర మార్కులు కొట్టేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలని విమర్శ
  • సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన అద్దంకి దయాకర్
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. విజయసాయి రెడ్డికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కూడా స్పందించారు. విజయసాయి రెడ్డి పెద్ద అజ్ఞాని అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వంపై తాము కూడా కామెంట్ చేయగలమని అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వంపై విజయసాయి రెడ్డికి ఇంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. ఏపీలో షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందనే ఇంత అక్కసు వెళ్లగక్కుతున్నారని అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. రాష్ట్రం విడిపోకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా? అని ప్రశ్నించారు. బానిసత్వంతో మోదీని జోకడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
 
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి సమస్యలు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకుంటారని అన్నారు. విజయసాయి రెడ్డి పెద్దల సభకు ఎలా ఎంపికయ్యారో అర్థంకావడం లేదన్నారు. ప్రధాని మోదీ దగ్గర ఎక్కువ మార్కులు పొందేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కూలిపోతుందని పెద్దల సభలో ఎలా అంటారని ప్రశ్నించారు. రాజకీయంగా ఏవిధంగా సమాధానం చెప్పాలో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా సమాధానం చెబుతుందని అన్నారు.  ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన వీడియోను విడుదల చేశారు.
Congress
Telangana
Vijay Sai Reddy
addanki Dayakar
YSRCP

More Telugu News