Nitish Kumar: ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్
- ఎన్డీయేలో చేరిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వచ్చి మోదీతో నితీశ్ భేటీ
- బలపరీక్షకు ఐదు రోజుల ముందు ప్రధానితో సీఎం భేటీ
- ఇరువురి మధ్య రాజ్యసభ ఎన్నికల అంశంపై చర్చ
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఎన్డీయేలో చేరిన తర్వాత జేడీయూ అధినేత మొదటిసారి ప్రధానితో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 12వ తేదీన నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోనుంది. బలపరీక్షకు ఐదు రోజుల ముందు వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండియా కూటమికి దూరం జరిగిన నితీశ్ కుమార్ జనవరి 28న ఎన్డీయేలో చేరారు. ఇప్పుడు తన రాజధాని పర్యటన సందర్భంగా మోదీ సహా బీజేపీ అగ్రనాయకులను కలుస్తున్నారు.
ఇప్పటికే కొంతమందితో జరిపిన భేటీలో రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. బీహార్‌లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా, ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. కాగా, అంతకుముందు బీజేపీ నేతలు, బీహార్ ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలు సోమవారం ప్రధానిని కలిశారు.