Free Electricity: తెలంగాణలో ఉచిత విద్యుత్తును తొలుత ఇచ్చేది వీరికే.. త్వరలోనే మార్గదర్శకాలు
- రేషన్ కార్డు, ఆధార్, సెల్‌ఫోన్ నంబరు అనుసంధానమై ఉన్న కనెక్షన్లకే తొలి దశలో ఉచిత విద్యుత్
- రేపో, ఎల్లుండో మార్గదర్శకాలు జారీ
- ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న విద్యుత్ సిబ్బంది
గృహజ్యోతి పథకంలో భాగంగా అందించనున్న ఉచిత విద్యుత్తుకు సంబంధించిన మార్గదర్శకాలు రేపో, మాపో విడుదల కానున్నాయి. తొలి దశలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ నంబరు అనుసంధానమైన కరెంటు కనెక్షన్లకు మాత్రమే ఉచిత విద్యుత్తును ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి ఆధారాలు సేకరిస్తున్న విద్యుత్ సిబ్బంది వీటినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
ప్రజాపాలనలో భాగంగా ఇటీవల ప్రజల నుంచి సేకరించిన దరఖాస్తుల్లో 81,54,158 మంది ఉచిత విద్యుత్తుకు దరఖాస్తు చేసుకోగా, వారిలో 30 శాతం మంది రేషన్ కార్డు, ఆధార్, సెల్‌ఫోన్ నంబరును సరిగా నమోదు చేయలేదని గుర్తించారు. దీంతో ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తున్న విద్యుత్ సిబ్బంది ఆ వివరాలను మళ్లీ సేకరిస్తున్నారు. అంతేకాదు, దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని గుర్తించారు. ఇలాంటి వారికి తొలి దశలో ఉచితంగా కరెంటు ఇవ్వకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 30 లక్షల కనెక్షన్లు మాత్రమే నెలకు 200 యూనిట్ల లోపు కరెంటు వాడుతున్నప్పటికీ 19.85 లక్షల మంది మాత్రమే ఉచిత విద్యుత్తు కోసం దరఖాస్తులు అందించారు. అలా ఇచ్చిన వారిలోనూ 5 లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డు వివరాల్లేవు. దాదాపు 10 లక్షల మంది అసలు దరఖాస్తే చేయలేదు. ఈ నేపథ్యంలో తొలి దశలో అన్ని ఆధార్, రేషన్, సెల్‌ఫోన్ నంబర్లు అనుసంధానమై ఉన్న కనెక్షన్లకు మాత్రమే ఉచిత విద్యుత్తు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.