CM Ramesh: టీడీపీ - బీజేపీ పొత్తుపై సీఎం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సీఎం రమేశ్
- జగన్ ను గద్దె దింపేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని వ్యాఖ్య
- హైకమాండ్ ఆదేశిస్తే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానన్న రమేశ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పాత మిత్రులు మళ్లీ ఒకటి కాబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ స్పందిస్తూ... రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు. త్వరలోనే ఏపీలో పొత్తులపై పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పారు.
అమిత్ షాను తాను కలిసినప్పుడు కూడా ఏపీ రాజకీయాలు చర్చకు వచ్చాయని సీఎం రమేశ్ తెలిపారు. ఏపీలో సీఎం జగన్ ను గద్దె దింపేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఏపీకి మేలు జరగాలంటే... బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. ప్రజలకు మేలు చేసే చట్టాలు చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ కూడా మద్దతుగా నిలిచిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని తెలిపారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీ బలంగా ఉందని అన్నారు.