Gandra Venkata Ramana Reddy: హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
- రెండెకరాల భూమిని గండ్ర స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారని కేసు
- ఆధారాలు లేకుండానే కేసు పెట్టారన్న గండ్ర
- పిటిషన్ ను ఈరోజు విచారించనున్న టీఎస్ హైకోర్టు
భూపాలపల్లి పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో పాటు వరంగల్ జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్ రెడ్డి పిటిషన్ వేశారు. పుల్లూరు రామలింగయ్యపల్లి శివారులోని చెరువు శిఖంలో రెండెకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించామంటూ తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని... ఆధారాలు లేకుండానే గత నెల 16న కేసు పెట్టారని పిటిషన్ లో వారు పేర్కొన్నారు. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు.
మరోవైపు, చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలను చేపట్టారంటూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును నాగవెల్లి రాజలింగమూర్తి ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వీరు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను హైకోర్టు నేడు విచారించనుంది.