Atchannaidu: 5 కోట్ల మందికి దేవాలయం లాంటి శాసనసభను ఎలా తయారుచేశారో చూడండి.. అచ్చెన్నాయుడు ఫైర్.. వీడియో ఇదిగో!
- తాము 8.55కే అసెంబ్లీకి వచ్చామన్న అచ్చెన్నాయుడు
- 9.10 అయినా వైసీపీ సభ్యులు రాలేదంటూ సమయం చూపించిన ఏపీ టీడీపీ చీఫ్
- ప్రభుత్వం మీద, జగన్ మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న నమ్మకానికి ఇది అద్దం పడుతోందని విమర్శ
- ఐదేళ్లలో ఏపీ వినాశనానికి దారితీసే చట్టాలే చేశారని మండిపాటు
అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం 175 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తామన్న సీఎం జగన్పై సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9.10 గంటలైనా అసెంబ్లీ హాలు ఖాళీగా ఉండడంతో ఆయన మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
9 గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీసు ఇవ్వడంతో తాము 8.55 గంటలకే అసెంబ్లీకి వచ్చామని, కానీ 9.10 అయినా ముగ్గురు వైసీపీ శాసనసభ్యులు మాత్రమే సభలో ఉన్నారని, జగన్పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9.10 గంటలైనా బెల్ కొట్టలేదని పేర్కొన్నారు. లోపల ముగ్గురంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండడమే అందుకు కారణమని అన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వైసీపీ శాసనసభ్యులకు ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు.
ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా, శాసనసభలో తమకు అవకాశం ఇవ్వకున్నా ప్రజా సమస్యలను లేవనెత్తుతామని అచ్చెన్నాయుడు తెలిపారు. తమను ఎన్ని అవమానాలకు గురిచేసినా ప్రజల గురించి శాసనసభకు వచ్చి తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క చట్టాన్ని కూడా శాసనసభలో చేయలేదని మండిపడ్డారు. చేసిన చట్టాలన్నీ రాష్ట్ర వినాశనానికి దారితీసినవేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మందికి దేవాలయంలాంటి సభను ఇంత దారుణంగా తయారుచేశారని, ఇకనైనా ప్రజలు ఆలోచించాలని కోరారు.