Hottest Year: లక్ష ఏళ్లలో ఇదే ప్రథమం... అత్యధిక ఉష్ణోగ్రతల ఏడాదిగా 2023
- పెరుగుతున్న భూతాపం
- 1.52 డిగ్రీల మేర పెరిగిన భూ ఉష్ణోగ్రత
- 2024లోనూ వాతావరణ వైపరీత్యాలు కొనసాగుతాయన్న శాస్త్రవేత్తలు
భూతాపం అంతకంతకు అధికమవుతోందని, రానున్న కాలంలో వాతావరణ మార్పుల పర్యవసానాలు అత్యంత తీవ్రంగా ఉండనున్నాయని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు.
తాజాగా, యూరప్ కు చెందిన కోపర్నికస్ వాతావరణ మార్పుల పరిశీలన సంస్థ ఆసక్తికర నివేదిక వెలువరించింది. గత లక్ష ఏళ్లలో లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాది బహుశా 2023 అయ్యుంటుందని తెలిపింది. మానవాళికి ఇదొక హెచ్చరిక అని శాస్త్రవేత్తలు పేర్కొనడంలో ఆశ్చర్యమేమీ లేదని అభిప్రాయపడింది.
ఎల్ నినో ఉత్పాతం ఫలితంగా ఓవైపు తుపానులు, మరోవైపు కరవు, కార్చిచ్చులు భూమండలాన్ని అతలాకుతలం చేస్తున్నాయని... 2023లో అత్యధిక ఉష్ణోగ్రతలకు కారణం వాతావరణ మార్పులేనని కోపర్నికస్ సంస్థ పేర్కొంది. 2024లోనూ ఈ విపరీత పరిణామాలు కొనసాగుతాయని వెల్లడించింది.
19వ శతాబ్దంలో నమోదైన భూమి సగటు ఉష్ణోగ్రతతో పోల్చితే... 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి వరకు నమోదైన భూమండలం సగటు ఉష్ణోగ్రతల్లో 1.52 డిగ్రీల సెల్సియస్ పైగా పెరుగుదల నమోదైనట్టు వివరించింది.
సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ ను తాకితే ఏమవుతుందో పారిస్ క్లైమేట్ చేంజ్ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారని, ఇప్పుడది అనుభవంలోకి వస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల ప్రభావం సామాజికంగానూ, ఆర్థికంగానూ మూల్యం చెల్లించేలా ఉందని స్పష్టం చేశారు.