Harish Rao: గవర్నర్ ప్రసంగంలో హామీలు, గ్యారెంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదు: హరీశ్ రావు

Harish Rao fires at governor speech

  • రెండు గ్యారెంటీలని కాంగ్రెస్ పాక్షికంగానే అమలు చేసిందన్న హరీశ్ రావు
  • నిరుద్యోగులకు రూ.4వేలు, ఆరోగ్యశ్రీ వంటి అంశాలను ప్రస్తావించలేదన్న బీఆర్ఎస్ నేత
  • ఆరు గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయని గుర్తు చేసిన హరీశ్ రావు

గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ హామీలు, గ్యారెంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగం ప్రజలకు ఏమాత్రం విశ్వాసం కలిగించలేకపోయిందన్నారు. ప్రజావాణి ద్వారా ప్రతిరోజు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజు మాత్రమే వెళ్లారన్నారు. ప్రజావాణికి రోజుకో మంత్రి వెళతారని చెప్పినప్పటికీ అది కూడా జరగడం లేదన్నారు. ఇప్పుడు అక్కడ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కలెక్టర్లు దరఖాస్తులు తీసుకునేవారని తెలిపారు.

రెండు గ్యారెంటీలను అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... పాక్షికంగా మాత్రమే అమలు చేశారన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఆరోగ్యశ్రీ ప్రస్తావన లేదంటే దాని అమలు సరిగ్గా లేదని చెప్పకనే చెప్పారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వాయిదా వేశారని విమర్శించారు. మరో పది పదిహేను రోజుల్లో ఎన్నికల కోడ్ అమలుల్లోకి వస్తే... హామీలను ఎలా నెరవేర్చుతారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఎప్పటి నుంచి ఇస్తారో గవర్నర్ ప్రసంగంలో చెప్పలేదన్నారు. రైతులకు బోనస్ ఇచ్చే విషయమై ఒక్క మాటా లేదన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై కూడా మాట్లాడలేదన్నారు. నిరుద్యోగులకు రూ.4వేలు ఇచ్చే విషయాన్నీ ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని నిలదీశారు. రూ.500లుకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గురించి మాత్రమే చెప్పారని... మేనిఫెస్టో అంశాల గురించి ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ, గవర్నర్‌ ప్రతిష్ట దిగజార్చిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయని గుర్తు చేశారు. మహాలక్ష్మిలో మూడు చెప్పి ఒకటి మాత్రమే అమలు చేశారన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పారని... ఇప్పటికి 60 రోజులు పూర్తయిందన్నారు. మరో పది రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తే... హామీల అమలును సాగదీసినట్లే కదా అని మండిపడ్డారు. 100 రోజుల్లో అమలు చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేసినట్లే అన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తామన్నారని.. కానీ 7వ తేదీ వచ్చినా జీతాలు పడలేదన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకైతే రెండు మూడు నెలలుగా జీతాలు రాలేదన్నారు.

  • Loading...

More Telugu News