Tammineni Sitaram: ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించాను: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం
- అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిసారి నిష్పక్షపాతంగా వ్యవహరించానన్న స్పీకర్
- అనేక ముఖ్యమైన బిల్లులు సభ ఆమోదం పొందాయని వెల్లడి
- విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనకు తాను బాధితుడిగా మారానని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిసారి నిష్పక్షపాతంగా వ్యవహరించానని, విపక్ష సభ్యులకు కూడా తాను సమాన అవకాశాలు కల్పించానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. తాను సభాపతిగా వ్యవహరించిన సమయంలో అనేక ముఖ్యమైన బిల్లులు సభ ఆమోదం పొందాయని ఆయన ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చానని, సభలో జవాబుదారీగా వ్యవహరించానని స్పీకర్ పేర్కొన్నారు.
సభగౌరవ మర్యాదలు పరిరక్షించేలా ప్రతి సభ్యుడూ నడుచుకోవాలని సూచించారు. విధుల నిర్వహణలో ప్రతిపక్ష సభ్యులు తనను ఇబ్బందికి గురిచేశారని సీతారాం అన్నారు. విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనకు తాను బాధితుడిగా మారానని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు తమ ప్రవర్తనతో శాసనసభ స్థాయిని తగ్గించారని విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల విమర్శలను తాను ఓపికగా భరించానని, వారి ప్రవర్తన తనను భాదించిందని ఆయన చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు 3 రోజులపాటు జరిగిన బడ్జెట్ సమావేశాలు గురువారం నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. శ్రీకాకుళం నుంచి శాసనసభ స్పీకర్గా పనిచేసిన నాలుగవ వ్యక్తిగా తనకు అదృష్టం దక్కిందని గుర్తుచేసుకున్నారు. కాగా ఏపీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట సెషన్‌లో 9 కీలకమైన బిల్లులు ఆమోదం పొందాయి. గురువారంతో సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.