Sajjala Ramakrishna Reddy: సీ ఓటర్ సంస్థ సర్వేకు విశ్వసనీయత లేదు: సజ్జల

Sajjala says no credibility for C Voter Survey

  • ఇవాళ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఫలితాలు విడుదల
  • ఏపీలో మొత్తం ఎంపీ స్థానాలు 25
  • టీడీపీకి 17, వైసీపీకి 8 స్థానాలు వస్తాయన్న సర్వే
  • సర్వే చేపట్టిన ఇండియా టుడే-సీ ఓటర్
  • సీ ఓటర్ గత ఎన్నికల్లోనూ ఇలాగే చెప్పిందన్న సజ్జల  

ఇండియాటుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట నిర్వహించిన సర్వేలో ఏపీలో టీడీపీకి 17, వైసీపీకి 8 లోక్ సభ స్థానాలు వస్తాయని వెల్లడైంది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. 

సీ ఓటర్ సంస్థ చేసిన సర్వేకు విశ్వసనీయత లేదని కొట్టిపారేశారు. 2019 మార్చిలో కూడా ఆ సంస్థ ఇలాంటి సర్వేనే చేసిందని గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి 35 శాతం ఓట్లు, టీడీపీకి 41-42 శాతం ఓట్లు వస్తాయని చెప్పిందని... టీడీపీకి 15 సీట్లు, వైసీపీకి 10 సీట్లు వస్తాయని చెప్పిందని సజ్జల వివరించారు. 

అదే సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో తమకు 11 సీట్లు, టీడీపీకి 14 సీట్లు ఇచ్చిందని... కానీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందేనని అన్నారు. "ఆ ఎన్నికల్లో మాకు 22 సీట్లు, టీడీపీకి 3 సీట్లు వచ్చాయి... ఓట్ల శాతం కూడా మాకే ఎక్కువగా వచ్చింది... సీ ఓటర్ సర్వే విశ్వసనీయత అలా ఉంటుంది" అని సజ్జల వివరించారు. 

సర్వేలను గురించి తాము పెద్దగా పట్టించుకోబోమని, తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని అన్నారు. ఈ ఐదేళ్లలో మేం చేసిన పనులు ఇవీ అని చెబుతూ ప్రజల దీవెనలు కోరడానికి మేమెంత ఆత్మవిశ్వాసంతో ఉన్నామో... నాలుగు ఓట్లు రాబట్టుకోవడానికి టీడీపీ, చంద్రబాబు ఎంత నిరాశానిస్పృహలతో ఉన్నారో గమనించాలి అని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News