YS Sharmila: జగనన్న ఎవరికి పులి, ఎవరికి సింహం?: షర్మిల
- దెందులూరులో షర్మిల సభ
- జగనన్న సీఎంగా ఉండి ఏం సాధించారన్న షర్మిల
- ఢిల్లీ నేతలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారని ఎద్దేవా
- చంద్రబాబు, జగన్ బీజేపీ నేతలకు తొత్తులుగా మారారని విమర్శలు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె వాడీవేడిగా ప్రసంగించారు. జగనన్న సీఎంగా ఉండి ఏం సాధించారని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ నేతలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే జగనన్న బీజేపీని నిలదీయాలని అన్నారు.
"జగనన్న పులి అని, జగనన్న సింహం అని ఆయనను అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. జగనన్న ఎవరికి పులి? జగనన్న ఎవరికి సింహం? జగనన్న సాక్షి పేపర్ వరకే పులా? సోషల్ మీడియా వరకే సింహమా? ఒకసారి ఆ పంజాను బీజేపీపై విసరాలి... దమ్ముంటే బీజేపీపై గాండ్రించాలి. మీరా పులులు, సింహాలు? ఆంధ్ర రాష్ట్రం పాలిట ద్రోహులు మీరు. ప్రశ్నిస్తే... ఓ ఆడబిడ్డ అని కూడా చూడకుండా వ్యక్తిగతంగా దూషిస్తూ, బూతులు మాట్లాడుతున్నారు. సొంత ఆడబిడ్డ అని చూడకుండా బజారుకు లాగుతున్నారు. వైసీపీకి చేతనైంది ఇదేనా?" అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.
బీజేపీతో జగన్, చంద్రబాబు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్నారు!
ఎన్నికలు వస్తుండడంతో బీజేపీతో జగనన్న, చంద్రబాబు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. పోటీ పడి మరీ బీజేపీతో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు బీజేపీ వాళ్లను ఒక్క మాట కూడా అనడంలేదని... వాళ్లు పిలవడం, ఈయన పోవడం ఏమిటో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. పిలిస్తే వెళ్లాడు సరే... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే పొత్తు అని ఎందుకు షరతు పెట్టడంలేదని షర్మిల ప్రశ్నించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే బీజేపీ కార్యకర్తలా ఉందని విమర్శించారు.
"చంద్రబాబు గతంలో 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. జగనన్న 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదన్నారు. కానీ చంద్రబాబు, జగన్ బీజేపీకి తొత్తులుగా మారారు. జగనన్న గెలిచిన తర్వాత హోదా కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదు" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో జగనన్న పరిస్థితి కూడా ఇంతే!
చంద్రబాబు బీజేపీని ఆకట్టుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నాడని, జగనన్న కూడా ఢిల్లీకి వెళుతున్నాడని షర్మిల పేర్కొన్నారు. ఢిల్లీలో జగనన్న పరిస్థితి కూడా అంతేనని, వంగి వంగి దండాలు పెట్టడంతోనే సరిపెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. ఏపీలో 25 మంది ఎంపీలు ఉండి కూడా బీజేపీకి గులాంగిరీ చేయాల్సిన అవసరం ఏంటని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.