Revanth Reddy: ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డి
- తమిళనాడు, కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని సూచన
- ప్రస్తుతం అమలు చేస్తోన్న ఇసుక విధానం అవినీతిమయంగా మారిందని వ్యాఖ్య
- ఇసుక రీచ్‌లు, డంప్‌లు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు. ఆయన ఈ రోజు సచివాలయంలో గనుల శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో సరికొత్త ఇసుక పాలసీని రూపొందించాలని ఆదేశించారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు.
ప్రస్తుతం అమలు చేస్తోన్న ఇసుక విధానం అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. తవ్వకాలు, రవాణాలో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయన్నారు. దాదాపు ఇరవై ఐదు శాతం ఇసుక అక్రమంగా తరలిపోతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లు, డంప్‌లు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.