Acid on Temple dieties: దొడ్డిపట్లలో దేవుళ్ల విగ్రహాలపై రసాయనాలు చల్లిన ఆగంతుకులు
- దొడ్డిపట్ల కేశవస్వామి ఆలయంలో ఘటన
- మూలవిరాట్టుతో పాటూ ఉత్సవవిగ్రహం, శఠగోపంపై కెమికల్స్ చల్లిన వైనం
- గర్భగుడి గ్రిల్స్ మధ్యలోంచి రసాయనాలు చల్లారన్న అర్చకుడు
- పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించిన గ్రామస్థులు
దేవుళ్ల విగ్రహాలపై ఆగంతుకులు రసాయనాలు చల్లిన దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల కేశవస్వామి ఆలయంలో వెలుగుచూసింది. ఉత్సవ విగ్రహాలతో పాటు శఠగోపం, ఆంజనేయస్వామి విగ్రహంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రసాయనాలు జల్లి పారిపోయారు. గర్భగుడి ప్రధాన ద్వారానికి ఇనుప ఊచలు ఉండటంతో వాటి మధ్యనున్న ఖాళీల నుంచి కెమికల్ స్ప్రే చేశారని అర్చకుడు నరసింహాచారి గుర్తించారు.
ఆలయద్వారాలు తెరిచే సరికే దుర్వాసన వచ్చిందని, విషంతో కూడిన కెమికల్స్ పడినట్టు అర్థమైందని నరసింహాచారి తెలిపారు. ఆ తరువాత విషయాన్ని ఆలయ అధికారి ఎన్. సతీశ్‌కు ఫోన్లో తెలిపామని చెప్పారు. అయితే, ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలున్నా 8 నెలలుగా అవి పనిచేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇక ఘటన విషయం తెలిసిన వెంటనే భజరంగ్‌దళ్ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.