BRS: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు
- హైదర్ గూడ వద్ద ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలు
- ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్
- ప్లకార్డులతో అసెంబ్లీకి వచ్చిన నేతలను అడ్డుకున్న పోలీసులు
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని అన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కారణంగా... 6.5 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం అందించాలని కోరారు. ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి ఆటోల్లో బయల్దేరారు.
ప్లకార్డులను పట్టుకుని అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నల్ల కండువాలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది సభలోకి అనుమతించలేదు. అయితే, కాసేపు వాగ్వాదం తర్వాత వారిని అనుమతించారు.