Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల్లో 96.88 కోట్ల మందికి ఓటు అవకాశం: కేంద్ర ఎన్నికల సంఘం
- 96.88 కోట్ల మంది ఓటు హక్కు కలిగివున్నారని వెల్లడి
- 18-29 ఏళ్ల లోపు యువత 2 కోట్ల మంది ఓటర్ల జాబితాలో ఉన్నారని వెల్లడించిన ఈసీ
- లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక డేటాను విడుదల చేసిన ఎన్నికల సంఘం
లోక్సభ ఎన్నికలు-2024 సమీపిస్తున్న వేళ భారత ఎన్నికల సంఘం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడానికి దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది అర్హత పొందనున్నారని వెల్లడించింది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 2 కోట్ల మంది యువ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారని తెలిపింది. ఈ మేరకు ఓటు కోసం నమోదు చేసుకున్నారని తెలిపింది. కాగా గత లోక్సభ ఎన్నికలు-2019తో పోల్చితే నమోదైన ఓటర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగిందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ‘ఎక్స్’ వేదికగా ప్రకటన విడుదల చేసింది.
ప్రపంచంలో అత్యధికంగా 96.88 కోట్ల మంది భారత ఓటర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారని ఈసీ పేర్కొంది. కాగా లింగ నిష్పత్తి విషయంలో పెరుగుదల నమోదయిందని, 2023లో 940గా ఉన్న లింగ నిష్పత్తి 2024లో 948కి చేరిందని వెల్లడించింది. ఓటర్ల జాబితాపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు పారదర్శకతతో జాబితాను రూపొందించామని పేర్కొంది.