Jayajayahe Telangana song: రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
- దళిత బిడ్డ అందెశ్రీకి ఉద్యమ గొప్పదనం దక్కకూడదనే ఆలోచనతో ‘జయజయహే తెలంగాణ’ గేయాన్ని దాదాపు నిషేధించారంటూ బీఆర్ఎస్పై ఆరోపణ
- తెలంగాణ తల్లి, తెలంగాణ అధికారిక చిహ్నాలను కూడా మార్చుతామని వెల్లడి
- రాచరికపు ఆనవాళ్లు ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ విధానమన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’ను మార్చుతామని వెల్లడించారు. ఈ గేయాన్ని తెలంగాణ కవి అందెశ్రీ ప్రజలకు అందించారని, ఈ పాట ద్వారా ఊపిరి పీల్చుకొని లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు, నగరాలు, పట్టణాలు, పల్లెలు, గ్రామాలు, అన్ని వీధుల్లోనూ ఇదే గేయం మోర్మోగిందని సీఎం ప్రస్తావించారు. ‘జయజయహే తెలంగాణ’ నినాదంతో రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రాన్ని సాధించిన ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుతామని స్పష్టం చేశారు. ఆ నాడు తెలంగాణ సాధన ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిన గొప్పదనాన్ని ఒక దళిత బిడ్డకు ఇవ్వకూడదన్న ఆలోచనతో, కుట్రతో నాటి పాలకులు జయజయహే తెలంగాణ గానాన్ని తెలంగాణలో వినిపించకుండా చేశారని, దాదాపు నిషేధించినంత పనిచేశారని ఆరోపించారు. అందుకే ఉద్యమస్ఫూర్తితో, ఉద్యమాలను గౌరవించే పార్టీగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ బిడ్డలా లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే విగ్రహం ఓ తల్లిలా ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా మార్చుతామని వెల్లడించారు. రాచరికపు ఆనవాళ్లు ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ విధానమని ఆయన పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ప్రతిపక్ష బీఆర్ఎస్కు నచ్చడంలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర గేయం, చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు విషయంలో తమకు ఎలాంటి ఆశలు, ఆశయాలు లేవన్నారు. ఈ విషయంలో ఏవైనా సూచనలు, సలహాలు ఉంటే చెప్పాలని స్పీకర్‌కి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.