Ramayapatnam Port: రామాయపట్నం పోర్టు వద్ద నిర్వాసితుల ధర్నా... మద్దతు పలికిన వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి
- రామాయపట్నం పోర్టు ద్వారం వద్ద కర్లపాలెం గ్రామస్తుల ధర్నా
- ఐదు రోజులుగా ధర్నా చేస్తున్న నిర్వాసితులు
- పునరావాసం కల్పించి ఆదుకోవాలని డిమాండ్
- రెండేళ్లుగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదన్న ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద నిర్వాసితుల ధర్నా నేడు కూడా కొనసాగింది. కర్లపాలెం గ్రామస్తులు ఐదు రోజులుగా రామాయపట్నం పోర్టు ముఖద్వారం వద్ద ధర్నా చేస్తున్నారు.
పునరావాసం కల్పించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చి న్యాయం చేసేంత వరకు ధర్నా ఆపేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. పెద్ద పెద్ద హామీలు ఇచ్చి భూములు, చేపల చెరువులు తీసేసుకున్నారని... భూములు తీసుకున్నాక తమను పట్టించుకున్న వారే లేరని వాపోయారు.
కర్లపాలెం గ్రామస్తులకు మద్దతుగా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కూడా ధర్నాలో పాల్గొన్నారు. కాగా, డిమాండ్ల పరిష్కారానికి పోర్టు అధికారులు ఐదు రోజుల గడువు కోరారు.
దాంతో అసహనానికి గురైన వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి "పోర్టు వద్ద మళ్లీ ఐదు రోజులు ధర్నా చేయాలా?" అని అధికారులను ప్రశ్నించారు. రెండేళ్లుగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మహీధర్ రెడ్డి మండిపడ్డారు.