Dejana Radanovic: భారత్ ఒక మురికి దేశం... నోరు పారేసుకున్న సెర్బియా టెన్నిస్ భామ
- ఇటీవల భారత్ లో ఐటీఎఫ్ టోర్నీ
- టోర్నీలో పాల్గొన్న డెజానా రదనోవిక్
- నాకు భారతదేశం నచ్చలేదు అంటూ వ్యాఖ్యలు
- పరిశుభ్రత అనేదే లేదు అంటూ సోషల్ మీడియాలో పోస్టు
భారత్ లో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీ జరిగింది. ఈ టోర్నీలో సెర్బియా క్రీడాకారిణి డెజానా రదనోవిక్ కూడా పాల్గొంది. అయితే టోర్నీ ముగిశాక ఈ అమ్మడు భారత్ గురించి నోరు పారేసుకుంది. భారత్ ఒక మురికి కూపమని అర్థం వచ్చేలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఐటీఎఫ్ టోర్నీలో పాల్గొనేందుకు కాస్త ముందుగానే భారత్ వచ్చిన రదనోవిక్ దాదాపు 3 వారాలపాటు ఇక్కడే ఉంది. అయితే, తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు భారతీయులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. భారత్ లో ఏ అంశం గురించి మాట్లాడాల్సి వచ్చినా దారుణం అని చెబుతానని పేర్కొంది.
"నాకు భారతదేశం నచ్చలేదు. నాకు అక్కడి ఆహారం నచ్చలేదు, ట్రాఫిక్ నచ్చలేదు, పరిశుభ్రత అనేదే లేదు. హోటల్ లో ఆహారంలో పురుగులు, మాసిన దిండ్లు, మురికిపట్టిన దుప్పట్లు! మా దేశం సెర్బియాకు వచ్చి చూడండి... ఇవే అంశాలు గనుక మీకు నచ్చలేదు అంటే మీరొక జాత్యహంకారి అన్నమాటే!" అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
రదనోవిక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఆమె భారత్ లో అడుగుపెట్టకుండా నిషేధం విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. భారతీయులే కాదు, అనేక దేశాలకు చెందిన వారు కూడా సెర్బియా టెన్నిస్ క్రీడాకారిణి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.