TS Budget: నేడే రేవంత్ సర్కార్ తొలి బడ్జెట్.. జనాలను మెప్పించేనా?
- మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న భట్టి విక్రమార్క
- మండలిలో బడ్జెట్ అంశాలను చదివి వినిపించనున్న శ్రీధర్ బాబు
- రూ. 2.72 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించే అవకాశం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతోంది. లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ప్రవేశ పెడుతున్న ఈ బడ్జెట్ జనాలను ఎంత వరకు మెప్పిస్తుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓటర్లను మెప్పించేలా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉండొచ్చా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ అంశాలను చదివి వినిపిస్తారు. బడ్జెట్ పై సోమవారం నాడు శాసనసభ, శాసనమండలిలో వేర్వేరుగా చర్చ జరుగుతుంది.
రూ. 2.72 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో... బడ్జెట్ లో కొత్త ప్రాజెక్టులు, భారీ కేటాయింపులు ఉండక పోవచ్చని సమాచారం. సార్వత్రిక ఎన్నికల తర్వాత జూన్ లేదా జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెడుతుంది.