Parliament: ముగిసిన 17వ లోక్ సభ సమావేశాలు... ప్రధాని మోదీ కీలక ప్రసంగం
- నిరవధికంగా వాయిదాపడిన పార్లమెంటు ఉభయ సభలు
- లోక్ సభలో అయోధ్య రామ మందిరం తీర్మానంపై చర్చ
- గత పదేళ్లలో భారత్ లో ఉత్పాదకత పెరిగిందన్న మోదీ
- రాబోయే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని వెల్లడి
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. 17వ లోక్ సభకు ఇవే చివరి సమావేశాలు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
సమావేశాలకు నేడు చివరి రోజు కాగా, స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ ఐదేళ్లలో లోక్ సభలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందినట్టు వెల్లడించారు. అధికార పార్టీ సభ్యులు, విపక్ష సభ్యులు అని తేడా లేకుండా అందరినీ సమానంగా చూశానని స్పష్టం చేశారు. అయితే, సభా మర్యాదలు, గౌరవం కాపాడేందుకు కొన్ని పర్యాయాలు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని తెలిపారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో అయోధ్య రామ మందిరం తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగించారు. కరోనా వంటి సంక్షోభం కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొని నిలబడ్డామని తెలిపారు. జీ20 సదస్సును ఘనంగా నిర్వహించడంతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ మరింత పెరిగిందని అన్నారు.
నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించుకున్నామని, సెంగోల్ (రాజదండం)ను మార్గదర్శంగా స్థాపించుకున్నామని వివరించారు. ఆర్టికల్ 370 రద్దు చేశామని, తద్వారా రాజ్యాంగ నిర్మాతల ఆత్మకు శాంతి చేకూరిందని మోదీ వివరించారు.
ఈ పదవీకాలంలో పార్లమెంటులో చేసిన అనేక సంస్కరణలు దేశ గతిని మార్చే అంశాలుగా నిలిచిపోయాయని అన్నారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్ అనే మూడు సూత్రాల ప్రాతిపదికగా ముందుకెళుతున్నామని, గత పదేళ్లలో దేశంలో ఉత్పాదకత పెరిగిందని చెప్పారు.
వచ్చే 25 ఏళ్లు భారత్ ప్రస్థానంలో ఎంతో కీలకంగా నిలుస్తాయని, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.