SI CPR: బస్ స్టాప్ లో మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేసి కాపాడిన పోలీస్.. వీడియో ఇదిగో!
- యాదాద్రి భువనగిరిలో ఉన్నట్టుండి కుప్పకూలిన మహిళ
- కాపాడాలంటూ భర్త కేకలు విని అక్కడికి చేరుకున్న ఎస్సై
- సీపీఆర్ చేసి వెంటనే ఆసుపత్రికి తరలించిన పోలీసులు
యాదాద్రి భువనగిరిలో ఓ ఎస్సై సమయస్ఫూర్తి మహిళ ప్రాణాలను కాపాడింది.. బస్ స్టాపులో కుప్పకూలిన మహిళకు ఎస్సై డి.మహేందర్ లాల్ సకాలంలో సీపీఆర్ చేయడంతో కళ్లు తెరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్సై సమయస్ఫూర్తిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. భువనగిరి బస్ స్టాప్ లో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు..
భువనగిరి మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన బోయిని వెంకటమ్మ, నర్సింహ దంపతులు ఆదివారం బస్ స్టాపులో బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఉన్నట్టుండి వెంకటమ్మ కుప్పకూలింది. ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయిన భార్యను చూసి ఏంచేయాలో తెలియక నర్సింహ కేకలు పెట్టాడు. భార్యను కాపాడాలంటూ నర్సింహ కేకలు పెట్టడంతో అటుగా వెళుతున్న వలిగొండ ఎస్సై డి.మహేందర్ లాల్ స్పందించారు. వెంటనే అక్కడికి చేరుకుని వెంకటమ్మను పరిస్థితిని గమనించారు. గుండెపోటుకు గురైందని భావించి సీపీఆర్ చేయడంతో కాసేపటికి వెంకటమ్మ కళ్లు తెరిచింది. ఆపై వెంకటమ్మను తన వాహనంలో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటమ్మకు ప్రాణాపాయం తప్పిందని, సకాలంలో సీపీఆర్ అందడంతో ఆమె బతికిందని వైద్యులు తెలిపారు.