Ram lalla: బాల రాముడి దివ్య నేత్రాలను చెక్కింది వీటితోనే.. అరుణ్ యోగిరాజ్ పోస్ట్ వైరల్
- వెండి సుత్తి, బంగారు ఉలి ఫొటోలను షేర్ చేసిన శిల్పి
- అరుణ్ కళా నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్న రామ భక్తులు
- అయోధ్యలో పూజలు అందుకుంటున్న బాలక్ రామ్ విగ్రహం
అయోధ్య రామమందిరంలో పూజలు అందుకుంటున్న బాల రాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విషయం తెలిసిందే. చిరునవ్వుతో కనిపిస్తున్న విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఆయన కళా నైపుణ్యాన్ని రామ భక్తులు అందరూ మెచ్చుకుంటున్నారు. నెటిజన్లు అయితే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన రూపొందించిన విగ్రహానికి కోట్లాది మంది భక్తులు పూజలు చేస్తున్నారని, ఇంతటి అదృష్టం ఎవరికి దక్కుతుందని అంటున్నారు. అరుణ్ యోగిరాజ్ కుటుంబం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తన కొడుకు రూపుదిద్దిన బాల రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించడం తమ కుటుంబానికి దక్కిన అదృష్టమని అరుణ్ తల్లి పేర్కొన్నారు.
తాజాగా బాల రాముడి విగ్రహానికి సంబంధించి ఓ కీలక విషయాన్ని అరుణ్ యోగిరాజ్ వెల్లడించారు. బాల రాముడి దివ్య నేత్రాలను చెక్కిన పనిముట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెండి సుత్తి, బంగారు ఉలిని చేతిలో పట్టుకుని చూపిస్తూ.. వీటితోనే బాల రాముడి విగ్రహానికి దివ్య నేత్రాలను తీర్చిదిద్దానని తెలిపారు. ఈ ఫొటోను అరుణ్ యోగిరాజ్ ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ గా మారింది.