Komatireddy Venkat Reddy: ఈ బడ్జెట్ ను విమర్శించిన వాళ్లు మూర్ఖులే!: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy fires on BRS leaders

  • నిన్న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కారు
  • తమ బడ్జెట్ లో వాస్తవికత ఉందన్న కోమటిరెడ్డి
  • బీఆర్ఎస్ నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వెల్లడి
  • కేసీఆర్ ముక్కు నేలకు రాసిన తర్వాతే నల్గొండలో అడుగుపెట్టాలన్న కోమటిరెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ... అన్ని రంగాలకు బడ్జెట్ లో సమ ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు. తమ బడ్జెట్ లో వాస్తవికత ఉందని అన్నారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే, తాము కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని, నిన్న తాము ప్రకటించింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమేనని కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. 

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. తమ బడ్జెట్ ను విమర్శించిన వాళ్లు మూర్ఖులేనని హరీశ్ రావు, కేటీఆర్ లను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. 

కుర్చీ వేసుకుని కూర్చుని ఎస్ఎల్ బీసీ పనులు పూర్తి చేయిస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారా? అని కోమటిరెడ్డి నిలదీశారు. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండ వస్తారు? ముక్కు నేలకు రాసి నల్గొండలో అడుగుపెట్టాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ సభకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News