AP JAC: సమ్మెకు సై... ఏపీ జేఏసీ అధ్యక్షతన 104 ఉద్యోగ సంఘాల కీలక సమావేశం
- ఉద్యమ శంఖారావం పోస్టర్ విడుదల చేసిన జేఏసీ నేతలు
- ఉద్యమ కార్యాచరణ వెల్లడించిన బండి శ్రీనివాసరావు
- ఈ నెల 14 నుంచి ఉద్యమం
- ఈ నెల 27న ఛలో విజయవాడ
- ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె
ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్రంలోని 104 ఉద్యోగ సంఘాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ నేతలు ఉద్యమ శంఖారావం పోస్టర్ ను ఆవిష్కరించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానంపై ఉద్యమ కార్యాచరణకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
"ఈ నెల 14న నల్ల బ్యాడ్జీలు ధరించి వినతి పత్రాలు అందిస్తాం. ఈ నెల 15, 16న భోజన విరామంలో పాఠశాలల్లో నిరసన తెలుపుతాం. ఈ నెల 17న మండల కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడతాం. ఈ నెల 20న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తాం. ఈ నెల 21 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో పర్యటిస్తాం. ఈ నెల 27న ఛలో విజయవాడ చేపడతాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఏ క్షణమైనా సమ్మెకు దిగుతాం" అని బండి శ్రీనివాసరావు వివరించారు.