MPDO: తెలంగాణవ్యాప్తంగా 350 మంది ఎంపీడీవోల బదిలీ
- సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని వేరే చోటికి పంపిన ప్రభుత్వం
- సోమవారం రిలీవ్.. బుధవారం కొత్తచోట జాయిన్
- పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు
రాష్ట్రవ్యాప్తంగా 350 మంది ఎంపీడీవోలను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. గడిచిన నాలుగేళ్లలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారిని, తమ సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారినీ వేరే చోటికి పంపించింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు వెలువరించింది. ఈమేరకు పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్ ఫర్ ఆర్డర్ అందుకున్న వారిని సోమవారం రిలీవ్ చేయాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.
బదిలీ చేసిన చోట బుధవారం రిపోర్ట్ చేయాలని అనితా రామచంద్రన్ ఎంపీడీవోలను ఆదేశించారు. కాగా, జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, డిప్యూటీ సీఈవోలు, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ల బదిలీలు కూడా జరుగుతాయని అధికారవర్గాల సమాచారం. మరోవైపు, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన బదిలీలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సేకరిస్తున్నారు. ఈ బదిలీలకు సంబంధించిన వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు.