Uttam Kumar Reddy: కేసీఆర్ ఓడిపోతున్నారని తెలిసే... జగన్ అలా చేశారు: అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy lashes out at kcr for favouring ap

  • కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి
  • కేసీఆర్ ఓడిపోతున్నారనే జగన్ సాగర్‌పైకి పోలీసుల్ని పంపించినట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్య
  • జగన్, కేసీఆర్ గంటల తరబడి మాట్లాడుకున్నారు... కలిసి బిర్యానీ తిన్నారని విమర్శ

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఓడిపోతున్నారని తెలిసే ఏపీ సీఎం జగన్ నాగార్జునసాగర్ పైకి పోలీసులను పంపినట్లుగా అనిపిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై ప్రభుత్వం సోమవారం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో జరిగిన జలదోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు.

అసెంబ్లీ ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ పైకి పోలీసులను పంపించిందని... రోజుకు మూడు టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయిందన్నారు. కేసీఆర్ ఓడిపోతున్నారనే జగన్ సాగర్‌పైకి పోలీసుల్ని పంపించినట్లుగా అనిపిస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో షరతులకు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగించేలా కొంతమంది మాట్లాడటం విడ్డూరమన్నారు.

జగన్.... కేసీఆర్‌ను పొగిడారు

బచావత్ ట్రైబ్యునల్ ఎలాంటి కేటాయింపులు చేయలేదని... రాష్ట్ర నీటి హక్కుల సాధనలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలకులది అసమర్థతో... అవగాహన లోపమో తనకు అర్థం కావడం లేదని... ఎందుకంటే ఢిల్లీ వెళ్లి ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు గత ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఆ కేటాయింపును ఏపీ ప్రభుత్వం శాశ్వతం చేస్తోందన్నారు. కృష్ణా జలాల్లో 70 శాతం హక్కులు పొందేందుకు తెలంగాణకు అర్హత ఉందన్నారు. కేసీఆర్, జగన్ గంటల తరబడి మాట్లాడుకున్నారని... కలిసి బిర్యానీ తిన్నారన్నారు. కేసీఆర్ గొప్పవారని జగన్ ఏపీ అసెంబ్లీలో పొగిడారని గుర్తు చేశారు. తెలంగాణ జలాలను మనకు ఇస్తున్నారని జగన్ చెప్పారని పేర్కొన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భారీ అవినీతి జరిగిందని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే రోజుకు 8 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలిస్తుందని... ఆ లిఫ్ట్ టెండర్ పూర్తయ్యాకే కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారన్నారు. ఇది ఏపీకి పరోక్షంగా సహకరించడమే అన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లి... అభ్యంతరం తెలిపి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఆగేదన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 2013లో ప్రాజెక్టు మొదలైనప్పటికీ ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేలా తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News