Daggubati Purandeswari: వైసీపీ తమ అభ్యర్థులనే కాదు ఓటర్లను కూడా మరో చోటుకి బదిలీ చేస్తోంది: పురందేశ్వరి
- వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపణ
- వచ్చే ఎన్నికల్లోనూ దొంగ ఓట్లతో గెలవాలనుకుంటున్నారని ఆరోపణ
- బీజేపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. సీఎం జగన్, వైసీపీ చెబుతున్న వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర దాగి ఉందని అన్నారు.
రాబోయే ఎన్నికల్లోనూ అక్రమ ఓట్ల సాయంతో గెలవాలని భావిస్తున్నారని, అందుకే ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి అభ్యర్థులతో పాటు ఓటర్లను కూడా బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఓట్ల దందాను సీఎం జగనే నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ శ్రేణులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అక్రమాలను అడ్డుకోవాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు.
"ఫేక్ ఎపిక్ కార్డులు రూపొందించి, దొంగ ఫొటోలు అతికించి ఒక్క తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లను వేశారు. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అభ్యర్థుల నియోజకవర్గాలు మార్చుతున్నారు. మంత్రి విడదల రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు బదిలీ అయ్యారు. వారి అనుయాయులు 10 వేల మందిని గుంటూరు తీసుకువచ్చి, వారి ఓట్లు నమోదు చేసే ప్రక్రియ లోపాయికారీగా జరుగుతోంది" అని పురందేశ్వరి ఆరోపించారు.