Komatireddy Raj Gopal Reddy: మేం తలుచుకుంటే మీలా చేయగలం... కానీ చేయం: హరీశ్ రావుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరిక

Komatireddy Rajagopal Reddy warning to Harish rao

  • అవినీతి సొమ్ముతో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని తాము అనుకోవడం లేదన్న కోమటిరెడ్డి
  • బీఆర్ఎస్ ధ్వంసం చేసిన వ్యవస్థలను తాము దారిలో పెడతామని వ్యాఖ్య
  • హరీశ్ రావు చాలా కష్టపడ్డారు.. కానీ ఏం లాభం నిర్ణయాలన్నీ కేసీఆర్‌వే అన్న కోమటిరెడ్డి

తాము తలుచుకుంటే మీలా చేయగలం... కానీ చేయమని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఉద్దేశించి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడారు. ప్రశ్నించే గొంతును (ప్రతిపక్షాన్ని) లేకుండా చేయాలని తాము అనుకోవడం లేదన్నారు. మేం తలుచుకుంటే మీలా చేయగలం కానీ చేయమన్నారు. అవినీతి సొమ్ముతో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని తాము అనుకోవడం లేదన్నారు.

బీఆర్ఎస్ ధ్వంసం చేసిన వ్యవస్థలను తాము దారిలో పెడతామన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు హరీశ్ రావు చాలా కష్టపడి పని చేశారని కితాబునిచ్చారు. కానీ ఏం లాభం... నిర్ణయాలు అన్నీ కేసీఆర్‌వే అని చురక అంటించారు. కేసీఆర్, కేటీఆర్ మాటలు వినడం ఆపేసి... హరీశ్ రావు మా మాటలు వినడం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.

తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ సమావేశాలకు, పార్టీ కార్యాలయాలకు వెళ్లినప్పుడు కేసీఆర్‌కు కాలు నొప్పి లేదు కానీ... శాసన సభలో ప్రజాసమస్యలపై చర్చ జరుగుతున్నప్పుడు మాత్రం ఆయన సభకు రావడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ కారుకు డ్రైవర్ లేరా? డ్రైవర్ లేని కారా? అని ఎద్దేవా చేశారు. వారిది రిపేర్‌కు పోయిన కారు కాదు... గ్యారేజీకి పోయిన కారు అన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ల పాటు ఎవరినీ మాట్లాడనీయలేదని ఆరోపించారు. నిర్ణయాలు అన్నీ సొంతగా తీసుకున్నారన్నారు.

  • Loading...

More Telugu News