Uttam Kumar Reddy: తెలంగాణ అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ వీడియో ప్రదర్శన
- తెలంగాణ నుంచి నీళ్లు తీసుకోవడానికి కేసీఆర్ అంగీకరించారని జగన్ అన్నట్లుగా ఉన్న వీడియో
- మనకు రావాల్సిన నీరు ఏపీకి ఇచ్చినట్లుగా జగన్ ఆన్ రికార్డుగా చెప్పారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తెలంగాణ అసెంబ్లీలో కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై చర్చ సందర్భంగా వీడియో ప్రదర్శన
తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించిన వీడియోను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రదర్శించారు. కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై ప్రభుత్వం సోమవారం తీర్మానం ప్రవేశపెట్టింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ... కేసీఆర్, జగన్ గంటల తరబడి మాట్లాడుకున్నారని, కలిసి బిర్యానీ తిన్నారని, కేసీఆర్ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారని గుర్తు చేశారు. తెలంగాణ జలాలు కేసీఆర్ మనకు ఇస్తున్నారని స్వయంగా జగన్ చెప్పారంటూ... ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించారు.
ఈ వీడియోలో జగన్ ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతున్నట్లుగా ఉంది. కేసీఆర్‌ను జగన్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మనం నీళ్లు తీసుకోవడానికి కేసీఆర్ అంగీకరించారని జగన్ అందులో పేర్కొన్నారు.
వీడియో ప్రదర్శన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఆ వీడియోలో ఏపీ సీఎం జగన్ తెలంగాణ నాటి సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపినట్లుగా ఉందన్నారు. వాళ్ల ప్రాంతం నుంచి... వాళ్ల బౌండరీ నుంచి... వాళ్ల నీళ్లు మనకు కేసీఆర్ ఇస్తున్నారు.. ఇందుకు ధన్యవాదాలు అని జగన్ చెప్పారని తెలిపారు. మనకు రావాల్సిన నీరు ఏపీకి ఇచ్చినట్లు జగన్ ఆన్ రికార్డ్‌గా చెప్పారన్నారు.
అయితే జగన్ మాట్లాడింది కృష్ణా నీటి గురించి కాదని, గోదావరి నీళ్లు అని ప్రతిపక్ష సభ్యులు చెప్పారు. దీనిపై ఉత్తమ్ మాట్లాడుతూ... జగన్ మాట్లాడింది గోదావరి జలాల గురించి కాదని, కృష్ణా జలాల గురించే అని చెప్పారు.