AP Employees: ఏపీ ప్రభుత్వంతో చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు ఏమన్నారంటే...!
- డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాల పోరాట కార్యాచరణ
- నేడు సచివాలయంలో ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు
- డీఏ బకాయిలు, మధ్యంతర భృతిపై చర్చించామన్న వెంకట్రామిరెడ్డి
- బకాయిలు ఎంత ఉన్నాయో తెలిసిందన్న బొప్పరాజు
- జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ నిరుత్సాహపరిచిందన్న బండి శ్రీనివాసరావు
ఏప్రీ ప్రభుత్వంతో రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు ముగిశాయి. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... డీఏ బకాయిలు, మధ్యంతర భృతి అంశాలపై చర్చించామని తెలిపారు. మార్చి 31 నాటికి రూ.5,600 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారని వెల్లడించారు. పీఆర్సీ బకాయిలపై గతంలో షెడ్యూల్ ఇచ్చారని పేర్కొన్నారు.
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ... ఉద్యోగులకు ప్రభుత్వం ఎంత బకాయి పడిందో తెలిసిందని అన్నారు. మార్చి నెలాఖరుకు కొన్ని బకాయిలు చెల్లిస్తామని చెప్పారని వెల్లడించారు. ఉద్యోగులకు డీఏ బకాయిలు రూ.7,500 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. సరెండర్ లీవ్ బకాయిలు రూ.2,600 కోట్లు ఉన్నాయని, ఏపీజీఎల్ఐ బకాయిలు రూ.600 కోట్లు ఉన్నాయని తెలిపారు.
సీపీఎస్ రూ.2,500 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారని బొప్పరాజు వెల్లడించారు. పోలీసులకు రూ.300 కోట్ల మేర బకాయిలు మార్చి 31 నాటికి చెల్లిస్తామని చెప్పారని వివరించారు. ఉద్యోగులకు మొత్తమ్మీద రూ.20 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని అన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు ఇవ్వాలని తాము కోరుతున్నామని, కానీ పోస్టులు మ్యాపింగ్ కాలేదని క్రమబద్ధీకరణ చేయడంలేదని బొప్పరాజు స్పష్టం తెలిపారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు. మెడికల్ రీయింబర్స్ మెంట్ చేయాలని కోరామని అన్నారు.
ఇక ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ... జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ నిరుత్సాహపరిచిందని తెలిపారు. తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మధ్యంతర భృతి విషయంలో ప్రభుత్వం స్పందించలేదని వెల్లడించారు. ఈ నెల 14న నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు ఆందోళన చేపడతారని, ఈ నెల 27న ఛలో విజయవాడ కార్యక్రమం జరుగుతుందని వివరించారు.