Hyderabad: హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై మెడికో ఆత్మహత్యాయత్నం? ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- ఓఆర్‌ఆర్ రోడ్డుపై సోమవారం కారులో అపస్మారక స్థితిలో మహిళ
- పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి
- మహిళ చేతికి కాన్యులా, పక్కనే సిరంజ్‌లు గుర్తించిన పోలీసులు
- ఇది సూసైడ్ కేసు అని వ్యాఖ్య, మహిళ ఓ మెడికో అని పోలీసుల వెల్లడి
హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై అపస్మారక స్థితిలో కనిపించిన ఓ మహిళా మెడికో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతురాలిని పోలీసులు ఆర్. రచనారెడ్డిగా గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అమీన్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం జిల్లాకు చెందిన రచనా రెడ్డి బాచుపల్లిలోని మమతా హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఘటన జరిగిన రోజున ఉదయం ఆమె 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు. కాగా, మాతంగి వద్ద ఓఆర్ఆర్‌పై ఆమె తన కారుపై అదుపు కోల్పోయి రెయిలింగ్‌ను ఢీకొట్టినట్టు ఉదయం 8.20 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఇది సూసైడ్ కేస్ అని పోలీసులు పేర్కొన్నారు. ఆమె చేతికి కాన్యులా ఉందని, పక్కనే రెండు సిరంజ్‌లు కూడా ఉన్నాయని చెప్పారు. అక్కడ ఇంజెక్షన్ బాటిల్ ఏదీ లేకపోవడంతో ఆమె ఉపయోగించిన మందు ఏదనేది తెలియరాలేదన్నారు. గత నవంబర్‌లో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని, ఆమెకు పెళ్లి ఇష్టం లేనట్టు తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.