Rapido Rider: పెట్రోలు అయిపోయిందన్నా దిగని ప్యాసెంజర్.. హైదరాబాద్‌లో ర్యాపిడో బైక్ డ్రైవర్ కష్టాలు.. వైరల్ వీడియోపై భిన్నాభిప్రాయాలు
- రైడ్ మధ్యలో అయిపోయిన పెట్రోలు.. బండిపై కూర్చునే వున్న ప్యాసెంజర్
- మరీ ఇంత కర్కశత్వమా? అని నెటిజన్ల ఆవేదన
- పెట్రోలు ఎంత ఉందో చూసుకోవద్దా? అంటూ రైడర్‌పై మరికొందరి ఆగ్రహం
హైదరాబాద్‌లో ఓ ర్యాపిడో బైక్ డ్రైవర్ కష్టాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీత చర్చకు దారితీసింది. దీనిపై నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి వాదించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? ఓ వ్యక్తి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. అతడిని ఎక్కించుకుని తీసుకెళ్తుండగా మధ్యలో పెట్రోలు అయిపోయింది. అయినప్పటికీ ప్రయాణికుడు బైక్ దిగేందుకు నిరాకరించడంతో డ్రైవర్ అతడిని బైక్‌పై కూర్చోబెట్టుకుని లాక్కెళ్లాడు. అదే రోడ్డుపై వెళ్తున్న వారు కొందరు ఈ ఘటనను రికార్డుచేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో క్షణాల్లోనే వైరల్ అయింది.
పలుమార్లు రిక్వెస్ట్ చేసినా
బైక్‌లో పెట్రోలు అయిపోయిందని, దయచేసి దిగాలని రైడర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బైక్ దిగేందుకు ప్యాసెంజర్ నిరాకరించాడు. దీంతో చేసేది లేక స్కూటర్‌ను అలాగే పెట్రోలు బంకు వరకు చెమటలు కక్కుకుంటూ లాక్కెళ్లాడు. వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయడంతో చర్చకు దారితీసింది.
రైడర్ తప్పే.. కాదు ప్యాసెంజర్ తప్పే
పెట్రోలు అయిపోయిందని, దిగాలని పలుమార్లు అభ్యర్థించినా దిగని ప్యాసెంజర్‌పై కొందరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చే 10, 20 రూపాయలకు ఇంత శిక్ష ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాటి మనిషిపై ఇంతటి కర్కశం ఏంటని, మనం ఏ యుగంలో ఉన్నామంటూ విరుచుకుపడ్డారు. మరికొందరు మాత్రం ప్యాసెంజర్‌కు వంతపాడారు. తను రైడ్‌కు వెళ్తున్నానని తెలిసినప్పుడు బైక్‌లో పెట్రోలు సరిపడా ఉందో? లేదో? చూసుకోవాల్సిన బాధ్యత రైడర్‌దేనని మరికొందరు వాదిస్తున్నారు.