Kadiam Srihari: కేసీఆర్ చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదు: కడియం శ్రీహరి

Kadiyam Srihari says Revanth Reddy government is not seeing telangana development

  • ఛలో నల్గొండ బహిరంగ సభకు బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి
  • నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా అడ్డుకుంటోందన్న కడియం
  • కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శ

కేసీఆర్ చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదని... తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ భవన్ నుంచి 'ఛలో నల్గొండ' బహిరంగసభకు బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా అడ్డుకుందని చెప్పారు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం రెండు నెలల్లోనే కృష్ణ, గోదావరి నదీ జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని విమర్శించారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ గళమెత్తిందన్నారు.

నదీ జలాల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు నల్గొండ జిల్లాలో బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ బహిరంగసభకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం అబద్ధాలను ప్రచారం చేసిందని, కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించడం మంచిది కాదని, దానివల్ల తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. కరెంటుకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం బీఆర్ఎస్‌పై ఉందన్నారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు నదీ జలాలపైనా, వాటిని కేంద్రానికి అప్పజెప్పితే వచ్చే నష్టాలపైనా సభలో వివరిస్తారన్నారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో దీనిని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News