KCR: నల్గొండలో కేసీఆర్ సభ ప్రారంభం.. కాలు విరిగినా కట్టె పట్టుకుని వచ్చానన్న కేసీఆర్
- నీళ్లు లేకపోతే మనది జీవన్మరణ సమస్య అన్న కేసీఆర్
- ఇది చావో, రేవో తేల్చుకోవాల్సిన సమయం అని వ్యాఖ్య
- చివరి శ్వాస వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనన్న బీఆర్ఎస్ అధినేత
నల్గొండలో బీఆర్ఎస్ జల శంఖారావం సభ ప్రారంభమయింది. సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ... కాలు విరిగినా కట్టె పట్టుకుని మీకోసం వచ్చానని చెప్పారు. తాను నిలబడలేనని, కూర్చొనే మాట్లాడతానని తెలిపారు. ఇది రాజకీయ సభ కాదని... ఉద్యమ సభ, పోరాట సభ అని చెప్పారు. ఐదు జిల్లాల జీవన్మరణ సభ అని అన్నారు. నీళ్లు లేకపోతే మన బతుకు లేదని అన్నారు. మన నీళ్లను కాజేయాలనుకుంటున్న వాళ్లకు ఈ సభ ఒక హెచ్చరిక అని చెప్పారు. కృష్ణా జలాలు మన జీవన్మరణ సమస్య అని చెప్పారు. కృష్ణా జలాల్లో మన వాటాను మనం సాధించుకోవాలని అన్నారు. ఇది చావో, రేవో తేల్చుకోవాల్సిన సమయం అని చెప్పారు.
తన తుదిశ్వాస వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని... పులిలా లేచి కొట్లాడతానే తప్ప, పిల్లిలా ఉండనని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పోయిందని చెప్పారు. ఫ్లోరైడ్ భూతంపై గతంలో ఏ నాయకుడూ పోరాడలేదని అన్నారు. నా రాష్ట్రం, నా గడ్డ అనే ఆరాటం ఉంటే ఎక్కడి వరకైనా పోరాడొచ్చని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలిచ్చే బర్రెను కాకుండా దున్నపోతును తెచ్చుకున్నారని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పోరాటం చేసి తెచ్చుకున్న రాష్ట్రాన్ని పదేళ్లు పాలించానని చెప్పారు. తెలంగాణ కోసం చివరి శ్వాస వరకు పోరాడుతానని అన్నారు.