Nara Lokesh: జగన్ దిక్కుమాలిన పాలనకు నిదర్శనం ఈ రోడ్డు: నారా లోకేశ్
- ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేశ్ శంఖారావం యాత్ర
- పాలకొండ నుంచి కురుపాం వెళ్లేందుకు గతుకుల రోడ్డులో ప్రయాణం
- సెల్ఫీ ఫొటో విడుదల చేసిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం యాత్ర కొనసాగిస్తున్నారు. కురుపాం వెళ్లే క్రమంలో గతుకుల రోడ్లపై ప్రయాణించిన ఆయన మార్గమధ్యంలో వాహనం ఆపి రోడ్డు పరిస్థితిని పరిశీలించారు. అక్కడ ఓ సెల్ఫీ తీసుకున్నారు. అంతేకాదు, గతుకుల రోడ్డు సెల్ఫీ ఫొటోతో పాటు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
"రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు పాలనకు ప్రత్యక్ష నిదర్శనం ఈ రోడ్డు. పాలకొండ నుంచి కురుపాం శంఖారావం సభలో పాల్గొనేందుకు వెళ్తుంటే కంకర పరిచి వదిలేసిన ఈ రహదారి కనిపించింది. విషయమేమిటని స్థానికులను వాకబు చేయగా, కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వకపోవడంతో సగంలో వదిలేసి వెళ్లాడని తేలింది.
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు రూ.1.80 లక్షల కోట్లు బకాయి పెట్టడంతో ఈ ప్రభుత్వ పనులు చేయడం తమవల్ల కాదని కాంట్రాక్టర్లు పరారైపోతున్నారు. అధికారపార్టీ నాయకులకు అడ్డగోలు దోపిడీపై తప్ప అభివృద్ధి పనులపై ఆసక్తిలేదు. జగన్ దిక్కుమాలిన పాలనకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?" అంటూ ధ్వజమెత్తారు.