Traffic Police: హెల్మెట్ లేకుండా దొరికిపోయి, పోలీస్ వేలు కొరికిన వాహనదారుడు... వీడియో ఇదిగో!
- విల్సన్ గార్డెన్ వద్ద రోడ్డుపై ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు
- హెల్మెట్ లేకుండా వచ్చిన స్కూటరిస్టు
- తాళాలు లాగేసుకున్న ట్రాఫిక్ పోలీసు
- వేలు కొరికి తాళాలు లాక్కునేందుకు ప్రయత్నించిన వాహనదారుడు
బెంగళూరులో ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ వేలు కొరికిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరు మహానగరంలో విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సయ్యద్ షఫీ అనే 28 ఏళ్ల వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా హెల్మెట్ లేకుండా కనిపించాడు. స్కూటర్ పై ప్రయాణిస్తున్న అతడిని పోలీసులు ఆపారు.
ఓ కానిస్టేబుల్ అతడి స్కూటర్ తాళాలు లాగేసుకోగా, ఈ తతంగాన్ని హెడ్ కానిస్టేబుల్ సిద్ధరామేశ్వర కౌజలగి సెల్ ఫోన్ లో రికార్డు చేయడం ప్రారంభించాడు. ఇంతలో, ఆ స్కూటరిస్టు తన బండి తాళాలు తిరిగి తీసుకునే ప్రయత్నంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికాడు.
తాను హెల్మెట్ పెట్టుకుని రావడం మర్చిపోయానని, హాస్పిటల్ కు వెళుతున్నానని, తననెందుకు ఆపుతున్నారని షఫీ పోలీసులపై మండిపడ్డాడు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని చిత్రీకరిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నుంచి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు.
ఎందుకిదంతా రికార్డ్ చేస్తున్నారు? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడ్నించి పారిపోయేందుకు ప్రయత్నం చేయడంతో, ట్రాఫిక్ పోలీసులు అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును దూషించడమే కాకుండా, శారీరకంగా గాయపర్చడం, నేరపూరితమైన బెదిరింపులకు పాల్పడడం వంటి అభియోగాలతో అతడిపై కేసు నమోదు చేశారు.