YS Jagan: సీఎం జగన్ ఆస్తుల కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టులో విచారణ
- సీబీఐ దర్యాప్తు ముగిశాకే ఈడీ దర్యాప్తు చేయాలన్న విజయసాయి, భారతి సిమెంట్
- విజయసాయి, భారతి సిమెంట్స్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు
- సుప్రీంలో సవాల్ చేసిన ఈడీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసులో సీబీఐ, ఈడీ కేసులపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. సీబీఐ దర్యాప్తు ముగిశాకే ఈడీ విచారణ చేపట్టాలని గతంలో విజయసాయిరెడ్డి, భారతి సిమెంట్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, సీబీఐ కేసుల్లో తీర్పు వచ్చాకే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే తెలంగాణ హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో, ఈడీ పిటిషన్ పై ఇవాళ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన సుప్రీం ధర్మాసనం వాదనలు విన్నది. తీర్పుపై నిర్ణయాధికారం ట్రయల్ కోర్టుకే ఉంటుందని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. సీఆర్పీసీ సెక్షన్ 309 ప్రకారం ట్రయల్ కోర్టుకు నిర్ణయాధికారం ఉంటుందని వివరించింది.
ఈ సందర్భంగా జయప్పన్ కేసులో తీర్పును జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉదహరించారు. ఈ మేరకు ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుతో పాటు వేరే కేసులు కూడా ఉన్నాయని సొలిసిటర్ జనరల్ సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది.