Abudhabi BAPS Mandir: అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. మందిరం విశేషాలు ఇవిగో!
- అబుదాబిలో నేడు బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని ప్రారంభిచనున్న మోదీ
- అబూ మారెఖ్ ప్రాంతంలో 27 ఎకరాల స్థలంలో నగరశైలిలో మందిరం నిర్మాణం
- యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు గుర్తుగా దేవాలయంపై ఏడు శిఖరాలు
- ప్రాచీన నాగరికతల కథలను గోడలపై చెక్కిన వైనం
- దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 8 దేవతామూర్తుల విగ్రహాల ఏర్పాటు
ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నేడు అబుదాబిలో బీఏపీఎస్ సొసైటీ నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రారంభిస్తారు. 27 ఎకరాల్లో నిర్మించిన ఈ మందిరం అబుదాబిలోని తొలి హిందూ దేవాలయంగా రికార్డు సొంతం చేసుకుంది. యూఏఈలో రెండో అతిపెద్ద హిందూ దేవాలయంగా మరో అరుదైన గుర్తింపు దక్కించుకుంది.
- దుబాయ్-అబుదాబిని కలిపే షెక్ జాయెద్ హైవేకు సమీపంలోని అబూ మారెఖ్ ప్రాంతంలో ఈ మందిరాన్ని నిర్మించారు. ఇందుకు కావాల్సిన స్థలాన్ని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది.
- 2019లో దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
- ఈ దేవాలయంలోని ప్రార్థనా మందిరంలో ఒకేసారి 3 వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. దీంతో పాటు కమ్యూనిటీ సెంటర్, ఎగ్జిబిషన్ హాల్, లైబ్రెరీ, చిన్న పిల్లల పార్కు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
- సంప్రదాయక నగార శైలి (ఉత్తర భారత శైలి) లో మందిరాన్ని నిర్మించారు. 108 అడుగుల ఎత్తున్న దేవాలయంపై యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు చిహ్నంగా ఏడు శిఖరాలను ఏర్పాటు చేశారు.
- సనాతన ధర్మంలోని ఎనిమిది గొప్ప లక్షణాలకు చిహ్నంగా దేవాలయ ముఖద్వారాలపై ఎనిమిది శిల్పాలను చెక్కారు. గంగా, యమున నదులను గుర్తుకు తెచ్చేలా మందిరం చుట్టు పలు శిల్పకళారూపాలను తీర్చిదిద్దారు.
- మాయ, ఆజ్టెక్, ఈజిప్ట్, అరబిక్, యూరోపియన్, చైనీస్, ఆఫ్రికన్ ప్రాచీన నాగరికతల్లోని కథలను మందిరంలోని గోడలపై చెక్కారు.
- మన దేశంలోని వివిధ దేవతా మూర్తులకు చెందిన ఏడు విగ్రహాలను కూడా మందిరంలో ఏర్పాటు చేశారు.
- కర్బన్ ఉద్గారాలు తగ్గించుకునేందుకు ఈ దేవాలయ నిర్మాణంలో చాలా భాగం ఫ్లై ఆష్‌ను వాడారు.
- దేవాలయంలో ఉష్ణోగ్రత, ఒత్తిడి తదితర సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా మొత్తం 150 సెన్సర్లను ఏర్పాటు చేశారు.
- బీఏపీఎస్ మందిరం ఇప్పటికే పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. బెస్ట్ మెకానికల్ ప్రాజెక్టు-2019, ఎమ్‌ఈపీ మిడిల్ ఈస్ట్ అవార్డు, బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ అవార్డు-2020, బెస్ట్ ఆర్కిటెక్చురల్, బెస్ట్ నగరా స్టైల్ అవార్డులను కూడా దక్కించుకుంది.