Ishan Kishan: ఇషాన్ కిషన్ ఎఫెక్ట్.. కొత్త నిబంధన తెస్తున్న బీసీసీఐ!
- రంజీల్లో ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేసుకుంటున్న ఇషాన్ కిషన్
- ప్రయాణ బడలికను కారణంగా చూపిస్తూ రంజీలకు డుమ్మా
- రంజీ ఆడాలంటూ ఇషాన్ కు బీసీసీఐ ఆదేశం
యువ కీపర్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ డొమెస్టిక్ క్రికెట్ ఆడటానికి అయిష్టతను చూపిస్తూ... కేవలం ఐపీఎల్ పైనే ఫోకస్ చేయడం పట్ల బీసీసీఐ పెద్దలు కన్నెర్రజేశారు. ఏకంగా కొత్త నిబంధననే తీసుకొస్తున్నారు. టీమిండియా జట్టులో లేనప్పుడు ఐపీఎల్ లో పాల్గొనాలంటే ఆ టోర్నీ కంటే ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచులు ఆడాలనే నిబంధనను తీసుకొస్తున్నారు.
దక్షణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి వచ్చిన తర్వాత... ప్రయాణ బడలికను కారణంగా చూపిస్తూ ఝార్ఖండ్ మ్యాచ్ లకు ఇషాన్ వరుసగా డుమ్మాలు కొట్టడం బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. దీంతో, రంజీల్లో ఝార్ఖండ్ చివరి గ్రూప్ మ్యాచ్ (16 నుంచి రాజస్థాన్ తో జరుగుతుంది) ఆడాలని ఇషాన్ ను బీసీసీఐ ఇప్పటికే ఆదేశించింది.
రంజీ గ్రూప్-ఏలో తన జట్టు అట్టడుగు స్థానంలో ఉన్నప్పటికీ పట్టించుకోకుండా... ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఇషాన్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు బీసీసీఐకి తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కొత్త నిబంధన తెచ్చేందుకు రెడీ అవుతోంది.