BRS: అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు ఎందుకు? మీడియా పాయింట్ వద్ద మాట్లాడనివ్వరా?: హరీశ్ రావు

Harish Rao blames government for not giving permission to talk in assembly

  • శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
  • మీడియా పాయింట్ వద్దకు వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు, మార్షల్స్
  • పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదం
  • సభ జరుగుతున్నప్పుడు తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణ
  • ఇప్పుడు మీడియా పాయింట్ వద్దకు కూడా వెళ్లనీయరా? అని ఆగ్రహం

అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలపై ఆంక్షలు ఎందుకు? అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సభలో మాట్లాడేందుకు తమకు మైక్ ఇవ్వడం లేదని... మీడియా పాయింట్ వద్ద సైతం మాట్లాడేందుకూ అవకాశం ఇవ్వరా? అని ప్రశ్నించారు. శాసన సభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. ఆ తర్వాత మీడియా పాయింట్ వద్దకు వెళుతుండగా పోలీసులు, మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సభ జరుగుతున్నప్పుడు తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇప్పుడు మీడియా పాయింట్ వద్దకు కూడా వెళ్లనీయరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు అడ్డం పెట్టడంపై కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి సహా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలకు ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు. అసెంబ్లీలోనూ... ఇక్కడా... రెండు చోట్ల గొంతు నొక్కుతారా? అని ధ్వజమెత్తారు. ఇక్కడ మూడు నాలుగు వేల మంది పోలీసులను మోహరించారన్నారు. ఇనుప కంచెలను తీసేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని... అలాంటప్పుడు ఇక్కడ ఆంక్షలు ఎందుకో చెప్పాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు అనుమతి ఇస్తారా? లేక కంచెలు బద్దలు కొట్టాలా? అని పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో అన్నారు. 

  • Loading...

More Telugu News