India vs England: రేపటి నుంచే మూడవ టెస్ట్ మ్యాచ్.. భారత తుది జట్టులో 4 కీలక మార్పులు!

this is the Team India predicton for 3rd Test vs England in Rajkot

  • కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో సర్ఫరాజ్ ఖాన్‌ లేదా పడిక్కల్‌ను ఆడించే అవకాశం
  • జట్టుకి అందుబాటులోకి వచ్చిన రవీంద్ర జడేజా
  • స్పిన్నర్లలో అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్‌లలో ఒకరిని తీసుకునే అవకాశం
  • పేసర్ ముఖేశ్ కుమార్‌ను పక్కనపెట్టి హైదరాబాదీ పేసర్ సిరాజ్ కు చోటివ్వం ఖాయం

దాదాపు 10 రోజుల విరామం తర్వాత రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ రేపటి (గురువారం) నుంచి షురూ కానుంది. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై పట్టు సాధించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఆడనున్న తుది జట్టు కూర్పు ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇక రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన శుభ్‌మాన్ గిల్ కూడా యథావిథిగా మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నాడు.

అయితే.. కీలక బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ జట్టుకు అందుబాటులో లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. మరో యువ బ్యాట్స్‌మెన్ పడిక్కల్ పేరుని కూడా పరిశీలించవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. వీరిద్దరిలో ఒకరికి చోటు ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. మిడిలార్డర్‌లో రజత్ పాటిదార్‌ను ఆడించే అవకాశాలున్నాయి. చేతి కండరాల గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా తిరిగి ఆల్‌రౌండర్‌గా జట్టులో ఆడనున్నాడు. ఇక ఇటీవలే జట్టులోకి తీసుకున్న యువ బ్యాటర్‌ ధృవ్ జురెల్‌ను వికెట్ కీపర్‌గా తీసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ విషయంలో అంతగా ఆకట్టుకోలేకపోతున్న కేఎస్ భరత్‌ స్థానంలో జురెల్‌ను తీసుకునే అవకాశాలున్నాయి. కీపింగ్ విషయంలో కూడా కేఎస్ భరత్ తడబడడంతో అతడిని మూడవ మ్యాచ్‌లో పక్కన పెట్టనున్నట్టు తెలుస్తోంది. 

స్పిన్నర్ల విషయానికి వస్తే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. ఇక రవిచంద్రన్ అశ్విన్ ప్రధాన స్పిన్నర్‌గా ఉండనున్నాడు. జడేజా తిరిగి ఆడడం దాదాపు ఖాయమవ్వడంతో అక్షర్ లేదా కుల్దీప్‌లలో ఒక్కరి పేరుని మాత్రమే పరిశీలించనున్నారు. పిచ్ రిపోర్ట్ ఆధారంగా ఎంపిక ఉండొచ్చని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక పేస్ బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్ కాగా.. వైజాగ్ టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముఖేష్ కుమార్ స్థానంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను తీసుకోనున్నారు.

తుది జట్టు అంచనా..
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

  • Loading...

More Telugu News