Team India: టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్ ఎవరు?... క్లారిటీ ఇచ్చిన జై షా
- జూన్ లో అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో టీ20 వరల్డ్ కప్
- టీమిండియా కెప్టెన్సీపై చర్చ
- హార్దిక్ పాండ్యా కెప్టెన్ అవుతాడని ప్రచారం
- రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందన్న జై షా
త్వరలోనే అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే టీమిండియాకు ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారన్న అంశం చర్చకు వస్తోంది. ఇటీవల సొంతగడ్డపై జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ మెట్టుపై ఓటమిపాలైంది. ఈ టోర్నీలో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు.
అయితే, జూన్ లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ లోనూ రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడా? లేకపోతే, సెలెక్టర్లు హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టతనిచ్చారు.
విదేశీ గడ్డపై జరిగే టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మే టీమిండియాకు కెప్టెన్ అని పరోక్షంగా తేల్చి చెప్పారు. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా విజేతగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 30న బార్బడోస్ లో జరిగే ఫైనల్లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఆడడం, గెలవడం ఖాయం అని జై షా పేర్కొన్నారు.
అయితే, గతేడాది సొంతగడ్డపై అహ్మదాబాద్ లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఎందుకు ఓడిపోయిందన్నదానిపై స్పందించేందుకు మాత్రం జై షా నిరాకరించారు.