Guiness Records: 4 గిన్నిస్ రికార్డులు కొల్లగొట్టిన యాదాద్రి జిల్లా వాసి
- మిలాన్‌లో జరిగిన కార్యక్రమంలో సత్తా చాటిన పనికెర క్రాంతి
- ముక్కులో మేకులు దూర్చుకోవడంలో కొత్త రికార్డు
- నాలుకతో టేబుల్ ఫ్యాన్ ఆపడం, భారీ బరువులు లాగడంలో నూతన రికార్డులు
- నూనెలో వేగుతున్న చికెన్ ముక్కలను చేతితో బయటకు తీసి మరో సాహసం
తెలంగాణలోని యాదాద్రి జిల్లా వాసి తన అసాధారణ సాహసాలతో ఏకంగా నాలుగు గిన్నిస్ రికార్డులు కొల్లగొట్టాడు. అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన పనికెర క్రాంతి ఈ అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇటలీలోని మిలాన్‌లో ఫిబ్రవరి 2 నుంచి 6 వరకూ జరిగిన కార్యక్రమంలో తన సాహసాలతో న్యాయనిర్ణేతలను మెప్పించాడు. తన రికార్డుల విశేషాలను క్రాంతి మీడియాతో పంచుకున్నాడు.
తిరుగుతున్న 57 టేబుల్ ఫ్యాన్లను క్రాంతి తన నాలుకతో ఆపి రికార్డు సృష్టించాడు. గతంలో 35 ఫ్యాన్లను ఆపిన వ్యక్తి పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. అంతేకాకుండా, గొంతులో కత్తులు దింపుకుని 1,944 కిలోల బరువును లాగి మరో సాహసం చేశాడు. 1,696 కిలోల బరువును 5 మీటర్ల మేర లాగడం గత రికార్డుగా ఉంది. ఇక 360 డిగ్రీల సెల్సియస్ వేడిలో మరుగుతున్న నూనెలోని 17 చికెన్ ముక్కలను చేతితో బయటకు తీయడం, నాలుగు అంగుళాల పొడవున్న 22 మేకులను రక్తపు చుక్క చిందకుండా సుత్తితో కొడుతూ ముక్కులో నిమిషంలో పెట్టుకుని మరో రెండు రికార్డులను సొంతం చేసుకున్నాడు. గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకోవాలని తనకు ఎప్పటి నుంచే ఉండేదని ఈ సందర్భంగా క్రాంతి చెప్పుకొచ్చాడు.